Kaghaznagar: బస్టాండ్‌లో నిఘా లోపం: ప్రయాణికుల భద్రత గాలికి!

Kaghaznagar: కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిఘా వ్యవస్థ పడకేసింది. ప్రయాణికులు దొంగతనాల భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 30 Oct 2026 1:07 PM IST
Kaghaznagar
X

Kaghaznagar: బస్టాండ్‌లో నిఘా లోపం: ప్రయాణికుల భద్రత గాలికి!

కాగజ్‌నగర్: కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించాల్సిన బస్టాండ్‌లోనే భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్‌లో నిఘా వ్యవస్థ నిర్వీర్యంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బస్సులు ఎక్కే సమయంలో, దిగే సమయంలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగులు, నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బస్టాండ్ పరిసరాల్లో దొంగతనాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

బస్టాండ్‌లో సీసీ కెమెరాలు పనిచేస్తే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంతో పాటు, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు పోలీసులకు ఆధారాలు లభిస్తాయి. కానీ కెమెరాలు పనిచేయకపోతే నేరాల దర్యాప్తులోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి పనిచేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించాలని, అవసరమైన చోట కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR