Koutala: 22-ఏ నిషిద్ధ జాబితా భూములపై కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం
Koutala: రాష్ట్రంలో కోటి ఎకరాలు వివాదాల్లో ఉన్నాయని, 22-ఏ జాబితా నుంచి భూములను తొలగించాలని కాంగ్రెస్‌పై మండిపాటు.
Koutala: 22-ఏ నిషిద్ధ జాబితా భూములపై కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం
కౌటాల: మండలంలో రైతులు భూనిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ భూవిధానాలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల భూములు వివాదాల్లో చిక్కుకున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పట్టా భూములను 22-A నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు తమ భూములను వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో మొత్తం 42,672 ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.
కాగజ్ నగర్ లో 4,406 ఎకరాలు కౌటాలలో 6,350 ఎకరాలు, చింతలమానెపల్లిలో 8,878 ఎకరాలు, బెజ్జూర్ లో 8,325 ఎకరాలు, పెంచికల్పేట్ లో 2,950 ఎకరాలు, దహేగాంలో 5,268 ఎకరాలు 22-A జాబితాలో ఉన్నాయని వివరించారు. 22-A జాబితాలో భూములు ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.
దీంతో రైతులు అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బింబాయి అనే ఓ రైతు తన రెండు ఎకరాల భూమిని 22-A నిషేధిత జాబితాలో చేర్చారని హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారని రైతు ఆవేదన వ్యక్తం చేసినట్లు హరీష్రరావు తెలిపారు.
'తాతల కాలం నుంచి మా కుటుంబంలో ఉన్న భూమిని కాపాడాలి నాభూమిని విడిపించండి సార్ అంటూ రైతులు తనను కోరుతున్నారని చెప్పారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది పేదలు, రైతుల ఆస్తులను 22-A జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అరోపించారు.
మంత్రి పొంగులేటిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్రెడ్డి వేగంగా స్పందించారని అదే విధంగా లక్షలాది మంది రైతుల భూముల సమస్యపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతుల ఆస్తులను ఇబ్బందుల్లోకి నెట్టిన రెవెన్యూ శాఖపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
ఎన్నికల సమయంలో అసైన్డ్ భూములతో పాటు అన్ని భూములను విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని హరీష్ రావు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రైతుల భూముల చుట్టూ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న 22-A నిబంధనల సమస్యను పరిష్కరించాలని, రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న సుమారు 1.50 లక్షల ఎకరాల భూముల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతుల భూముల సమస్యపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ నెల 7న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో 22-A భూముల సమస్యను ప్రస్తావించి రైతుల పక్షాన గట్టిగా పోరాడతామని తెలిపారు. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.




