Kagaznagar: పేపర్ మిల్లు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
Kagaznagar: కాగజ్‌నగర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం.
Kagaznagar: పేపర్ మిల్లు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
కాగజ్‌నగర్: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ యాజమాన్యం వెంటనే కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని పేపర్ మిల్లు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి అధితతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు.
అనంతరం రాములు నాయక్ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు, జీవన వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పేపర్ మిల్లు కార్మికుల వేతనాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం, ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
ముఖ్యంగా పేపర్ మిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి, కార్మికులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. త్వరలోనే కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని కోరడంతో పాటు కార్మిక శాఖ అధికారులపై కూడా ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.
గతంలో పేపర్ మిల్లు పునఃప్రారంభానికి తాము చేసిన కృషిని రాములు నాయక్ గుర్తు చేశారు. 2013లో సుమారు రూ.100 కోట్ల రాయితీ ఇప్పించి మిల్లును తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో 96 బస్సు డిపోలు ఉండగా సుమారు 30 వేల మంది కార్మికులు ఉన్నారని, అక్కడ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకున్నప్పటికీ, సుమారు 3 వేల మంది కార్మికులు పనిచేస్తున్న పేపర్ మిల్లులో ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి అధిత మాట్లాడుతు పేపరు మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించే వరకు ఐక్యంగా పోరాడుదామని అన్నారు.




