Kumuram Bheem: జైనూర్‌లో కోటి విలువైన గంజాయి తోట ధ్వంసం - ఇద్దరి అరెస్ట్
Kumuram Bheem: జైనూర్‌లో కోటి ఇరవై ఐదు లక్షల విలువైన గంజాయి తోట గుట్టు రట్టు. 1,245 మొక్కలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎస్పీ నితికా పంత్.
Kumuram Bheem: జైనూర్‌లో కోటి విలువైన గంజాయి తోట ధ్వంసం - ఇద్దరి అరెస్ట్
కొమురం భీమ్: జైనూర్ మండలంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి తోటను పోలీసులు గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో మొత్తం 1,245 గంజాయి మొక్కలతో పాటు 11 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.1.25 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో సీఐ రమేష్, ఎస్‌ఐ రవి సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పట్నాపూర్ మెయిన్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన *అంబురే పుండలిక్ (50)*ను పోలీసులు తనిఖీ చేయగా.. అతని టవల్‌లో దాచిన 11 గ్రాముల ఎండు గంజాయి లభించింది. ప్రభుత్వ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో పుండలిక్ తన కుమారుడు అంబురే రమేష్తో కలిసి తమ వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను అక్రమంగా సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారి, ప్రభుత్వ పంచ సాక్షుల సమక్షంలో పోలీసులు వ్యవసాయ భూమిని తనిఖీ చేశారు. అక్కడ సాగు చేస్తున్న 1,245 గంజాయి మొక్కలను వేర్లతో సహా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో అంబురే పుండలిక్, అంబురే రమేష్లను సెప్టెంబర్ 14న అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ సాగు, రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అక్రమ మాదకద్రవ్య కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
గంజాయి సాగుపై నిఘా పెట్టి నిందితులను పట్టుకున్న జైనూర్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, జైనూర్ సీఐ రమేష్, ఎస్‌ఐ రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




