Mancherial: మందమర్రిని నేర, డ్రగ్స్ రహితంగా మార్చాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా
Mancherial: రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేశారు. మందమర్రిని నేర, మాదకద్రవ్య రహిత ప్రాంతంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.
Mancherial: మందమర్రిని నేర, డ్రగ్స్ రహితంగా మార్చాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా
మంచిర్యాల జిల్లా: మందమర్రి ప్రాంతంలో నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి నేర రహిత, మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీస్ అధికారులను ఆదేశించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా సీపీ అంబర్ కిశోర్ ఝా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, మందమర్రి ఎస్‌ఐ నరేష్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
స్టేషన్ పరిసరాలను పరిశీలించిన సీపీ.. పోలీస్ స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రిసెప్షన్ కేంద్రం సిబ్బందితో మాట్లాడి రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌లో 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు సిబ్బంది బ్యారక్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, అన్ని రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు.
స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడిన సీపీ.. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై వారి వ్యక్తిగత, శాఖాపరమైన అంశాలతో పాటు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న ప్రధాన నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, నేర నియంత్రణ చర్యలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలపై ఎస్‌ఐ నుంచి సీపీ వివరాలు తెలుసుకున్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని అన్ని విభాగాల పనితీరును సమీక్షించినట్లు సీపీ తెలిపారు. రిసెప్షన్ కేంద్రం పనితీరు, పెట్రోల్ వాహనాల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, వివిధ విభాగాల పనితీరు, ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలను సమగ్రంగా సమీక్షించినట్లు పేర్కొన్నారు.
మందమర్రి సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కావడంతో ప్రత్యేక సవాళ్లు ఉన్నాయని సీపీ తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగే దొంగతనాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గతంలో కేసులు నమోదైన వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచుతూ వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అవసరాన్ని బట్టి నిబంధనల ప్రకారం గ్యాంగ్ ఫైళ్లను ప్రారంభించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన పోలీస్ సేవలు అందించేలా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.




