Mancherial: స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి అదనపు కలెక్టర్ చంద్రయ్య!

Mancherial: రక్తదానంతో అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడవచ్చు: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంలో మంచిర్యాల అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య పిలుపు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 1 Oct 2026 7:24 PM IST
Mancherial
X

Mancherial: స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలి అదనపు కలెక్టర్ చంద్రయ్య!

Mancherial: రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ–మంచిర్యాల జిల్లా రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనత వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి, అలాగే ప్రమాదాల్లో గాయపడి అత్యవసరంగా రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే రక్తం ఎంతో విలువైనదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో రక్తాన్ని అందించడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

రక్తనిధి కేంద్రానికి రక్తదాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, సింగరేణి సంస్థతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం అత్యధికసార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన రక్తదాతలు, ప్లేట్లెట్లను దానం చేసిన స్వచ్ఛంద రక్తదాతలను ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా ప్రతినిధులు, సిబ్బంది, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.