Mancherial: డిసెంబర్ 31లోగా ఉద్యోగుల ఈఎస్‌ఆర్ అప్‌డేట్ పూర్తి చేయాలి!
Mancherial: జనవరి 1 నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ డిజిటల్ విధానంలోనే జరుగుతాయని, డిసెంబర్ 31లోగా ఈఎస్‌ఆర్ అప్‌డేషన్ పూర్తి చేయాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ వి.రాములు ఆదేశించారు.
Mancherial: డిసెంబర్ 31లోగా ఉద్యోగుల ఈఎస్‌ఆర్ అప్‌డేట్ పూర్తి చేయాలి!
మంచిర్యాల: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు పరిపాలనా వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌కు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఎఫ్ఎంఐఎస్ (IFMIS) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నూతన డిజిటల్ విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు సూచించారు.
గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హెచ్‌ఓఓలు, డీడీఓలు, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండేతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా అన్ని బిల్లుల సమర్పణ డిజిటల్ విధానంలో కొనసాగుతోందని తెలిపారు. 2027 జనవరి 1 నుంచి మాన్యువల్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ డిజిటల్ విధానంలోనే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
సర్వీస్ రిజిస్టర్ల అప్‌డేషన్‌కు డెడ్‌లైన్
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లలో నమోదు చేయాల్సిన వివరాలు, అవసరమైన మార్పులు, అప్‌డేషన్ల ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జనవరి 1 నుంచి ఎంప్లాయీ సర్వీస్ రిజిస్టర్ (ఈఎస్‌ఆర్) పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన ప్రతి అంశం డిజిటల్ రికార్డుల్లో నిక్షిప్తం కానున్న నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఒక్కసారి నమోదు చేస్తే మార్చడం సాధ్యం కాదు!
శిక్షణలో భాగంగా ఈఎస్‌ఆర్‌లో ఉద్యోగుల వ్యక్తిగత, సర్వీసు వివరాల నమోదు, నియామకాలు, పోస్టింగులు, సెలవుల దరఖాస్తులు, సెలవుల రద్దు తదితర అంశాలను ప్రాక్టికల్‌గా వివరించారు. ఈఎస్‌ఆర్‌లో ఒకసారి నమోదు చేసిన వివరాలను తిరిగి ఎడిట్ లేదా డిలీట్ చేసే అవకాశం ఉండదని, అందువల్ల వివరాల నమోదు, పరిశీలన, ఆమోదం సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
డిజిటల్ విధానంపై ఉద్యోగులకు ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త విధానాలపై పట్టు సాధించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ పాలనను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే, హెచ్‌ఓఓలు, డీడీఓలు, మండల స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.




