Mancherial: భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు
Mancherial: భూ భారతి పోర్టల్లోని పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ వి. రాములు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
Mancherial: భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు
మంచిర్యాల: భూ భారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు ఆదేశించారు.
గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో భూ భారతి పోర్టల్లో పాస్బుక్ డేటా సవరణ సేవపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పాస్బుక్ డేటా సవరణకు సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. భూ భారతి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు జీఓ నంబర్లు 59, 76కు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన క్షేత్రస్థాయి విచారణలు పూర్తి చేసి, సంబంధిత రికార్డులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు, దరఖాస్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం అర్హమైన దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు.
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయి ప్రక్రియలను వేగవంతం చేయాలని, ప్రజలకు సకాలంలో రెవెన్యూ సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్పాండే, బి, డి, ఎఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




