Mancherial: ‘ఆన్ డ్యూటీ’ రికార్డుల్లో.. ఫామ్‌హౌస్‌లో పోలీసుల చిందులు!
Mancherial: బెల్లంపల్లి 1 టౌన్ పోలీసులు విధుల్లో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేసుకుని, ఫామ్‌హౌస్‌లో విందు వినోదాల్లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mancherial: ‘ఆన్ డ్యూటీ’ రికార్డుల్లో.. ఫామ్‌హౌస్‌లో పోలీసుల చిందులు!
మంచిర్యాల: మంచిర్యాల బెల్లంపల్లి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీసులే వివాదంలో చిక్కుకున్నారు. విధుల్లో ఉన్నట్లు స్టేషన్ రికార్డుల్లో నమోదు చేసుకుని, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో విందు వినోదాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతున్నాయి. కత్తెర్ల గ్రామ సమీపంలోని మ్యాంగో రిసార్ట్ ఫామ్‌హౌస్‌లో పోలీసులు వర్షంలో డ్యాన్స్‌లు చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతున్న దృశ్యాలతో కూడిన 58 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
12 మంది పోలీసులు ఒకేచోట ఎందుకు?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నవంబర్ 15న బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పలువురు సిబ్బంది అధికారిక రికార్డుల్లో విధుల్లో ఉన్నట్లు నమోదై ఉన్నారు. అయితే, వారిలో కొందరు ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే, స్టేషన్ రికార్డుల్లో మూవ్‌మెంట్ ఎంట్రీ చేయకుండానే కత్తెర్ల గ్రామ సమీపంలోని మ్యాంగో రిసార్ట్ ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 12 మంది పోలీసులు ఒకేచోట చేరి విందు వినోదాల్లో పాల్గొన్నారనే ప్రచారం జరుగుతోంది. పట్టపగలు వర్షంలో డ్యాన్స్‌లు చేయడం, స్విమ్మింగ్ పూల్‌లో గడపడం వంటి దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపిస్తున్నాయి.
ఉన్నతాధికారుల ఆదేశాలతోనే వెళ్లారా?
ఈ వ్యవహారంపై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు సిబ్బంది ఫామ్‌హౌస్‌కు వెళ్లింది ఉన్నతాధికారుల ఆదేశాలతోనేనా? ఒకేసారి 12 మంది సిబ్బంది అక్కడికి వెళ్లడానికి కారణమేంటి? వారు విధుల్లో ఉన్న సమయంలో స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? సిబ్బంది కదలికలపై పర్యవేక్షణ లోపించిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితులకు అందుబాటులో లేని సిబ్బంది?
మరోవైపు, ఆరోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కొందరు బాధితులు సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారనే సమాచారం కూడా చర్చకు వస్తోంది. ప్రజలకు సేవలు అందించాల్సిన సమయంలో సిబ్బంది స్టేషన్‌లో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రికార్డుల పరిశీలనతో వెలుగులోకి రానున్న వాస్తవాలు
వైరల్ వీడియో నేపథ్యంలో స్టేషన్ లో సీసీ ఫుటేజీ హాజరు రికార్డులు, మూవ్‌మెంట్ రిజిస్టర్, స్టేషన్ డైరీలను ఉన్నతాధికారులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై స్పందించి విచారణ చేపడతారా? బాధ్యులుగా తేలిన సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? స్టేషన్ ఇన్‌చార్జ్ బాధ్యతపై కూడా విచారణ జరుగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.




