Mancherial: కన్నాల బస్తీ స్థలం కబ్జా ఆరోపణల్లో వాస్తవం లేదు: రాజయ్య!

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీలో తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని ఇతరులు కబ్జా చేశారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మోకనపల్లి రాజయ్య కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 28 Nov 2026 7:19 AM IST
Mancherial
X

Mancherial: కన్నాల బస్తీ స్థలం కబ్జా ఆరోపణల్లో వాస్తవం లేదు: రాజయ్య!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీలో తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని ఇతరులు కబ్జా చేశారంటూ పత్రికల్లో ప్రచురితమైన వార్తల్లో వాస్తవం లేదని మోకనపల్లి రాజయ్య కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తమ స్థలంపై కొందరు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా మోకనపల్లి రాజయ్య మాట్లాడుతూ.. 1950వ దశకంలో తమ కుటుంబ సభ్యులు సింగరేణిలో పనిచేస్తూ, ఇదే ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారని తెలిపారు. అప్పట్లో ఇళ్లు నిర్మించుకుంటున్న సమయంలో మానవతా దృక్పథంతో సర్వేష్ అనే వ్యక్తికి తమ ఇంటి పక్కన కొంత స్థలాన్ని ఇచ్చామని పేర్కొన్నారు. అయితే అప్పట్లో అక్కడి నుంచి వెళ్లిపోయిన సర్వేష్ సుమారు 40 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి ఆ స్థలం తనదేనంటూ వివాదానికి తెరలేపుతున్నారని ఆరోపించారు.

ఇటీవల కొన్ని పత్రికల్లో ప్రతాప్ అనే వ్యక్తి తమ స్థలాన్ని కబ్జా చేశాడంటూ వచ్చిన వార్తలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు స్థలం తమ కుటుంబానికి చెందినదేనని, తామే ప్రతాప్‌కు కిరాయికి ఇచ్చామని స్పష్టం చేశారు. అక్కడ ఉన్న చిన్న షెడ్డును తొలగించి కొంత పెద్దదిగా నిర్మించుకునేందుకు కూడా తామే అనుమతి ఇచ్చామని, అలాంటప్పుడు కబ్జా జరిగిందంటూ వార్తలు రావడం సరికాదని పేర్కొన్నారు.

ప్రస్తుతం సర్వేష్ కొందరు స్థానిక వ్యక్తుల సహకారంతో తమపై ఒత్తిడి తెస్తూ డబ్బులు ఇవ్వాలని లేదా స్థలాన్ని అప్పగించాలని బెదిరిస్తున్నారని రాజయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు, పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. తమ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.