Mancherial: కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించాలి
Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల, శెట్టిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేసి రవాణా వేగవంతం చేయాలని ఆదేశించారు.
Mancherial: కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించాలి
మంచిర్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కేటాయింపుల ప్రకారం సంబంధిత రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు రవాణా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
శనివారం జైపూర్ మండలంలోని టేకుమట్ల, శెట్టిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, నిల్వలు, రవాణా, నాణ్యత ప్రమాణాలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండా సేకరించాలని సూచించారు. తేమ శాతం పరిశీలన, నాణ్యత ప్రమాణాల నిర్ధారణ ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కొత్తగా ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి తలెత్తకుండా రవాణా ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అలాగే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. తాగునీరు, నీడతో పాటు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయ్యర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా కొనుగోలు కేంద్రాల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు నుంచి మిల్లులకు తరలించే వరకు ప్రతి దశలో పారదర్శకత పాటించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




