Mancherial: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం – ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

Mancherial: మంచిర్యాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. హాజరైన అధికారులు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 11 Sept 2026 9:29 PM IST
Mancherial
X

Mancherial: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం – ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

మంచిర్యాల జిల్లా: ఉపాధ్యాయుల కృషి, అంకితభావంతోనే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు, ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచడంతో పాటు బోధనా నాణ్యతను మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల లెర్నింగ్ ఔట్‌కమ్ పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆధునిక సాంకేతికత, నూతన బోధనా పద్ధతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, వసతి వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా విద్యార్థులకు పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు.

27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఉత్తమ ఎన్రోల్మెంట్ సాధించిన 20 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఎన్‌ఎంఎంఎస్ ద్వారా అధిక సంఖ్యలో స్కాలర్‌షిప్‌లు సాధించిన 3 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఎస్‌ఎస్‌సీ ఎన్రోల్మెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ముగింపులో అధికారులు, ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, మేయర్ ధర్ని మధుకర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, జిల్లా విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.