Mancherial: రెవెన్యూ సమస్యలను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ కుమార్ దీపక్!
Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో రెవెన్యూ అంశాలపై కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్ష భూ సమస్యలు, ఓటరు సవరణ, సాదాబైనామా దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశం.
Mancherial: రెవెన్యూ సమస్యలను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ కుమార్ దీపక్!
మంచిర్యాల: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), రీ-సర్వే, సాదాబైనామా, 22-ఎ, భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి, కళ్యాణలక్ష్మి–షాదీముబారక్, కోర్టు కేసులు, ఆర్‌అండ్‌ఆర్ చట్టం, ఇసుక, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు.
ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు, పెండింగ్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడంతో పాటు రీ-సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. సాదాబైనామా, 22-ఎ, భూభారతి దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు.
రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి ద్వారా అందుతున్న ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిశీలించి అర్హులైన వారికి త్వరితగతిన పరిష్కారం అందించాలని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా పర్యవేక్షణ పెంచాలని, భూసేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కోర్టు కేసులు, ప్రభుత్వ భూ వివాదాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు రెవెన్యూ సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ సమస్యలను కాలపరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు.




