Mancherial: కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు.. వేగవంతంగా పనులు!

Mancherial: మంచిర్యాల జిల్లా భీమారంలో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన. కేజీబీవీ, తహసిల్దార్ కార్యాలయం, పీహెచ్‌సీ, సమత రైస్ మిల్‌లో అభివృద్ధి పనుల తనిఖీ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 23 Oct 2026 6:03 PM IST
Mancherial
X

Mancherial: కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు.. వేగవంతంగా పనులు!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమారం మండల కేంద్రంలోని సమత రైస్ మిల్‌తో పాటు మద్దికల్ గ్రామం, తహసిల్దార్ కార్యాలయం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి వివిధ పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా సమత రైస్ మిల్లుకు కేటాయించిన వరి ధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మద్దికల్ గ్రామంలో చేపట్టనున్న భూ రీ సర్వే ప్రక్రియను ఉదయం వేళల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

భీమారం తహసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల హాజరు పట్టిక, భూభారతి దరఖాస్తుల పరిశీలన, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తులను సంబంధిత రికార్డులతో సరిపోల్చి, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పాఠశాల స్టోర్ గది, వంటగదిని తనిఖీ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థినులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.

భీమారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, ఇతర వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.