Mancherial: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారమే జరగాలి
Mancherial: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారమే జరగాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. జీవో 59, 76 అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Mancherial: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారమే జరగాలి
మంచిర్యాల: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జీవో నంబర్ 59, 76 అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ, సింగరేణి భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలు, అర్హతలు, నిర్దేశిత గడువులకు అనుగుణంగా ప్రక్రియను చేపట్టాలని సూచించారు.
నిర్దేశించిన కటాఫ్ తేదీకి ముందుగా జరిగిన ఆక్రమణలకు మాత్రమే, సంబంధిత జీవో నిబంధనల ప్రకారం అర్హత ఉన్న సందర్భాల్లో క్రమబద్ధీకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. భూముల క్రమబద్ధీకరణకు ముందు అవి అటవీ భూముల పరిధిలోకి వస్తాయా లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, అటవీ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
సింగరేణి భూములపై ప్రత్యేక దృష్టి
జీవో నంబర్ 59 ప్రకారం 500 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్దేశించిన అర్హతలు, నిబంధనలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జీవో నంబర్ 76 అమలులో భాగంగా తహసీల్దార్లు, సింగరేణి అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు కానివారు సింగరేణి క్వార్టర్లలో నివసిస్తున్నట్లయితే నిబంధనల ప్రకారం వాటిని ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సింగరేణి నిర్మాణాల్లో నివసిస్తున్న వారికి సంబంధిత మున్సిపాలిటీల ద్వారా ఆస్తి పన్ను విధించడం, ఇంటి నంబర్లు కేటాయించడం వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి చర్యలు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత మున్సిపల్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూముల క్రమబద్ధీకరణలో పారదర్శకత పాటిస్తూ ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులు, సింగరేణి అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.




