Mancherial: భారీ వర్షాల అలర్ట్: రంగంలోకి రామగుండం సీపీ.. రాళ్లవాగు వద్ద క్షేత్రస్థాయి పరిశీలన!

Mancherial: మంచిర్యాలలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన రామగుండం పోలీసులు. పాత మంచిర్యాల రాళ్లవాగును పరిశీలించి ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టిన సీపీ అంబర్ కిషోర్ ఝా.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 29 July 2026 2:52 PM IST
Mancherial
X

Mancherial: రాళ్లవాగు ఉద్ధృతి క్షేత్రస్థాయిలో సీపీ అంబర్ కిషోర్ ఝా తనిఖీ

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో ఉన్న రాళ్లవాగును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పాత మంచిర్యాల ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి, అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని చెప్పారు. పోలీసులు సూచించిన ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, వాగులు, వంకలు, ముంపు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల వైపు ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో అవసరమైతే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పొందిన సుమారు 30 మంది సిబ్బంది అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని, గత ఏడాది వరదల సమయంలో బోట్ల సహాయంతో గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా తరలించినట్లు గుర్తు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు.

ఈ పరిశీలనలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story