Mancherial: దేవాపూర్ పీఎస్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్
Mancherial: దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తనిఖీ చేసి పెండింగ్ కేసులు, రౌడీషీటర్ల నిఘా, సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు.
Mancherial: దేవాపూర్ పీఎస్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్
మంచిర్యాల: నేరాల నియంత్రణలో పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ సూచించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గురువారం దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీసీపీ.. సిబ్బంది విధుల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ఎస్‌ఐ గంగారాంతో కేసుల ఆన్‌లైన్ నమోదు, ఐటిటి ఎస్‌ఓ కేసులు, ఈ-సాక్ష్య, ఈ-సమన్ల అమలు, దర్యాప్తులో ఉన్న కేసులు (UI), పెండింగ్‌లో ఉన్న పాత కేసుల పురోగతిపై సమీక్షించారు. స్టేషన్ పరిధిలో తరచూ నమోదవుతున్న నేరాల వివరాలను తెలుసుకుని, వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, అనుమానితులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌లో 5ఎస్ మేనేజ్‌మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి అధికారి, సిబ్బంది సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
అలాగే ప్రజలు, వ్యాపారులు తమ దుకాణాలు, నివాసాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం పెరిగితే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని డీసీపీ ఎ. భాస్కర్ పేర్కొన్నారు.




