Mancherial: గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందించాలి - ఎన్‌సీఎస్‌టీ
Mancherial: మంచిర్యాలలో ఎన్‌సీఎస్‌టీ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సమీక్ష. గిరిజనులకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించాలని అధికారులకు ఆదేశం.
Mancherial: గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందించాలి - ఎన్‌సీఎస్‌టీ
మంచిర్యాల జిల్లా: గిరిజన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందించాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్ తదితర అధికారులతో కలిసి వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, సాగునీరు, రహదారులు, ఉపాధి, గృహ వసతి, మౌలిక వసతులు మెరుగుపర్చాలని సూచించారు.
అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గిరిజనుల ఫిర్యాదులను పోలీసులు సత్వరమే స్వీకరించి చట్టపరంగా పరిష్కరించాలని, మహిళలు, బాలల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
దూర ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
అర్హులైన ఏ ఒక్క గిరిజన కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. గిరిజనుల భూమి, జీవనోపాధి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రతకు సంబంధించిన సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వేగంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు.




