Mancherial: కరెంట్ కోతలు ఆపాలి: కన్నెపల్లి సబ్స్టేషన్ ముట్టడి!
Mancherial: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి సబ్స్టేషన్ను బీజేపీ ముట్టడించింది. కరెంట్ కోతలు ఎత్తివేసి, ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు.
Mancherial: కరెంట్ కోతలు ఆపాలి: కన్నెపల్లి సబ్స్టేషన్ ముట్టడి!
మంచిర్యాల: అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేసి రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ రాష్ట్ర నేత, జడ్పీటీసీల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆశన్న ఆధ్వర్యంలో నాయకులు సబ్స్టేషన్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలు, హెచ్చుతగ్గుల వోల్టేజీ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో వోల్టేజీ కారణంగా పంటలకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయని, హై వోల్టేజీ, లో వోల్టేజీ సమస్యలతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు. దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని అన్నారు. రైతులకు రోజుకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కొయ్యల ఏమాజి విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ కోతలను నివారించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆశన్న, సీనియర్ నాయకులు బొల్లెడ్ల కేశవరెడ్డి, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్య యాదవ్, గోవర్ధన్, జిల్లా కార్యదర్శి ఆకుల శంకర్, బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు యుగంధర్, బీజేపీ నాయకులు సురేష్, మల్లేష్, మహేందర్, డాగయా తదితరులు పాల్గొన్నారు.




