Mancherial: రూ. 5 లక్షల జీవిత బీమాతో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు
Mancherial: మంచిర్యాల 07వ డివిజన్ ఆర్‌కే-8 అంబేద్కర్ గ్రౌండ్‌లో రూ. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్‌లైన్ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
Mancherial: రూ. 5 లక్షల జీవిత బీమాతో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు
మంచిర్యాల: పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 07వ డివిజన్ ఆర్‌కే-8 అంబేద్కర్ గ్రౌండ్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారుల నుంచి రూ.5 లక్షల కుటుంబ జీవిత బీమాకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా కృషి చేస్తామని, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.




