Mancherial: గూడెం జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
Mancherial: దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 24న కార్తీక పౌర్ణమి జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలు.
Mancherial: గూడెం జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
మంచిర్యాల: దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 24న జరగనున్న కార్తీక పౌర్ణమి జాతరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన.. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడెం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా భక్తులకు తాగునీటి సౌకర్యం, భోజన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, రద్దీ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
జాతర సమయంలో భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సంబంధిత శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రసాద్, ఎమ్మార్వో రోహిత్, ఏసీపీ ప్రకాష్, సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, సింగిల్ విండో వైస్ చైర్మన్ బిల్లకూరి శంకరయ్య, మంచిర్యాల జిల్లా ఆర్‌జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




