Mancherial: విద్యా రంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం: అదనపు కలెక్టర్!

Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య పూలమాల వేసి నివాళులర్పించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 11 Nov 2026 7:41 PM IST
Mancherial
X

Mancherial: విద్యా రంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం: అదనపు కలెక్టర్!

మంచిర్యాల: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆజాద్, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారని తెలిపారు.

పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అనేక విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు పరిశోధనా రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి దేశ ప్రగతికి దోహదపడిందన్నారు.

విద్య కేవలం ఉద్యోగం పొందేందుకు మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక సమానత్వానికి, దేశాభివృద్ధికి ప్రధాన సాధనమని ఆజాద్ విశ్వసించారని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.