Mancherial: పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ యువతకు వాలీబాల్ పంపిణీ!
Mancherial: మంచిర్యాల రంగపేటలో టౌన్ పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. 40 బైక్లు సీజ్ చేయడంతో పాటు యువతకు వాలీబాల్, నెట్ను అందజేశారు.
Mancherial: పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ యువతకు వాలీబాల్ పంపిణీ!
మంచిర్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణే లక్ష్యంగా మంచిర్యాల టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో రంగపేటలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు నేతృత్వంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువతకు ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ..
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మంచిర్యాల టౌన్ పోలీసులు వాలీబాల్, నెట్ను అందజేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




