Mancherial: శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన!
Mancherial: మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్లతో శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.
Mancherial: శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన!
మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి వైభవంగా అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రాంగణంలో నూతన ఆలయాల నిర్మాణం కోసం నిర్వహించిన శంకుస్థాపన మహోత్సవంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన వేడుకను ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు.
సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పరమశివుడు, శ్రీ వాసవి మాత ఆలయాలను నూతనంగా నిర్మించనున్నారు. పుర ప్రముఖుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చొరవతో దేవాదాయ శాఖ ఆగమ శాస్త్ర నియమాలు, స్థపతుల సూచనలకు అనుగుణంగా ఉత్తర ముఖ ద్వారంతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. నూతన ఆలయం భక్తులకు మరింత ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించాలని, ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ముక్త రవి, ఆలయ అర్చకులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కొత్త రాజేశం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అర్కాల హేమలత, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




