Mancherial: ప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామకాలు

Mancherial: మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్య విభాగం పోస్టుల భర్తీ పూర్తి. పారదర్శకంగా మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 23 Oct 2026 6:09 PM IST
Mancherial
X

Mancherial: ప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామకాలు

మంచిర్యాల: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని పారదర్శకంగా నిర్వహించి, అభ్యర్థుల ప్రతిభ, మెరిట్, అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

శుక్రవారం హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్య విభాగం అధ్యాపకుల నియామక ప్రక్రియకు కళాశాల ప్రిన్సిపల్ దేవాజీ, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అశోక్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం ఎంపిక చేపట్టినట్లు పేర్కొన్నారు.

అభ్యర్థుల రాత పరీక్ష మార్కులు, పీజీ మార్కులు, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులతో పాటు విద్యార్హతలు, ప్రతిభ, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది మెరిట్ జాబితా రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో అభిషేక్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఆయనను ఎంపిక చేయాలని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థి త్వరలో విధుల్లో చేరేలా నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కళాశాల మైదానం అభివృద్ధి, క్రీడా వసతులు, తాగునీటి సౌకర్యం, ఇంటర్నెట్ సదుపాయాల మెరుగుదలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.