Mancherial: ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
Mancherial: ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ డిమాండ్ చేశారు.
Mancherial: ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
మంచిర్యాల: ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కళాశాలల యాజమాన్యాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్యను తొలగించి సీనియర్ సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే వేలాది జూనియర్ కళాశాలల భవిష్యత్తుతో పాటు లక్షలాది మంది విద్యార్థుల విద్యావకాశాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదో తరగతి తర్వాత 40 శాతం మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్న ప్రభుత్వ వాదనపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిప్లొమా వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులను కూడా డ్రాప్అవుట్లుగా పరిగణిస్తున్నారా అని ప్రశ్నించారు. ఏ విద్యా సంవత్సరం గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఉందని, అలాంటప్పుడు ఇంటర్మీడియట్ విద్యను అదే శాఖలో విలీనం చేస్తే అవసరమైన వసతులు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులకు అవసరమైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, ఇతర సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూరే ప్రమాదం
ఇంటర్మీడియట్ విద్యలో మార్పుల వల్ల నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థల ప్రభావం పాఠశాల విద్యలోనూ పెరిగే ప్రమాదం ఉందని సాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా వ్యవస్థాగత మార్పులు చేపడితే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక బోధనను ఎలా కొనసాగిస్తారో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ ఉచిత విద్యను అమలు చేయాలని, విద్యార్థుల ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరించేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యారంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని సిద్ధంశెట్టి సాజన్ ప్రభుత్వానికి సూచించారు.




