Mancherial: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: కలెక్టర్!
Mancherial: మంచిర్యాల జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
Mancherial: అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: కలెక్టర్!
మంచిర్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత గల ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 18 వార్డుల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ సతీష్తో కలిసి సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. వలస వెళ్లిన, మరణించిన, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన ఓటర్ల వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగిస్తే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, పరిశీలన అనంతరం జాబితాలో నమోదు చేస్తామని పేర్కొన్నారు.
అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న అర్హులైన యువతీ యువకుల పేర్లను ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వలస, డబుల్ ఎంట్రీలు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపునకు ఫారం-7 ద్వారా చర్యలు చేపడుతున్నామని వివరించారు.
జిల్లాలో మ్యాపింగ్ కాని, అసాధారణ వివరాలున్న జాబితాలోని సుమారు 1.70 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 1.64 లక్షల మంది నుంచి ధ్రువపత్రాలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రత్యేక శిబిరాల సమయంలో బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దుర్గామాత మండలిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు సంతోషంగా, సామరస్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగల సందర్భంగా మున్సిపాలిటీలు, గ్రామాల్లో లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
తదనంతరం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25, 12, 13 వార్డుల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ కృష్ణతో కలిసి సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




