Manchiryala: గాంధారి ఖిల్లాపై మందమర్రి రన్నర్స్ సాహస యాత్ర
Manchiryala: మంచిర్యాల జిల్లాలోని చారిత్రక గాంధారి ఖిల్లాపై పర్యాటక అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో మందమర్రి రన్నర్స్ 6 కి.మీ మేర సాహసయాత్ర చేపట్టారు.
Manchiryala: గాంధారి ఖిల్లాపై మందమర్రి రన్నర్స్ సాహస యాత్ర
మంచిర్యాల: జిల్లాలోని చారిత్రక గాంధారి ఖిల్లా విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటక అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో మందమర్రి రన్నర్స్ ట్రెక్కింగ్ నిర్వహించారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని గాంధారి ఖిల్లాపై సుమారు 30 మంది రన్నర్స్ ఆరు కిలోమీటర్ల మేర సాహసయాత్ర చేపట్టారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన రన్నర్స్, వాకర్స్ క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎత్తైన, క్లిష్టమైన గుట్టలపై సాగిన ట్రెక్కింగ్‌లో సభ్యులు పలు సవాళ్లను అధిగమిస్తూ ఖిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గాంధారి ఖిల్లా చారిత్రక నేపథ్యం, ప్రాచీన విశిష్టత, ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
భవిష్యత్తులో మరింత భారీ స్థాయిలో ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రాథమికంగా రూట్ మ్యాపింగ్ చేపట్టారు. ఇందులో భాగంగా గాంధారి శిఖరాన్ని చేరుకునే మార్గాలను పరిశీలించి నాలుగు ముఖ్యమైన ట్రెక్కింగ్ పాయింట్లను గుర్తించారు. భారీ ట్రెక్కింగ్‌కు అవసరమైన మార్గాలు, ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించేందుకు కసరత్తు చేశారు.
గాంధారి ఖిల్లా చారిత్రక వైభవం, ప్రకృతి అందాలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో నిర్వహించనున్న భారీ ట్రెక్కింగ్ కార్యక్రమంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రన్నర్స్ గుడికందుల రమేష్, పప్పు నారాయణ, వడ్డేపల్లి సాయికృష్ణ, పద్మతో పాటు పలువురు రన్నర్స్, వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ప్రకృతి పట్ల ఆసక్తిని పెంచడం, ట్రెక్కింగ్‌ను ప్రోత్సహించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.




