Mancherial: ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ బీఎల్‌ఏలకు మంత్రి వివేక్ దిశానిర్దేశం

Mancherial: మంచిర్యాల జిల్లా మందమర్రి కాంగ్రెస్ బీఎల్‌ఏల సమావేశంలో మంత్రి గడ్డం వివేక్ మాట్లాడారు. 100% ఓటరు నమోదు సాధించిన వారిని రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్తామన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 18 Oct 2026 5:24 PM IST
Mancherial
X

Mancherial: ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ బీఎల్‌ఏలకు మంత్రి వివేక్ దిశానిర్దేశం

మంచిర్యాల జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించే బాధ్యత బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

మరో వారం రోజులపాటు కొత్త ఓటర్ల నమోదుకు గడువు ఉన్నందున అర్హులైన వారందరి పేర్లు నమోదు చేయించేందుకు కృషి చేయాలన్నారు. వంద శాతం ఓటరు నమోదు సాధించేందుకు కృషి చేసిన బీఎల్‌ఏలను ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్‌ గాంధీతో కలిపిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వివేక్‌ వెంకటస్వామి నివాసంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఫ్లెక్సీల విషయంలో విభేదాలకు తావివ్వకుండా, తప్పనిసరిగా ప్రోటోకాల్‌ పాటించాలని స్పష్టం చేశారు. కార్యకర్తలంతా కలిసిమెలిసి ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పొదుపు అవసరం

ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తాగునీరు, సాగునీటితోపాటు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. తాను కూడా నీటిని పొదుపుగా వాడుకుంటూ విద్యుత్‌ ఆదా చేస్తున్నానని తెలిపారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ పరిస్థితులపైనా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నీరు, విద్యుత్‌ పొదుపులో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా లేవని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి నాణ్యత లోపాలు, అవకతవకలే కారణమని ఆరోపించారు. మేడిగడ్డ పంపులను ఆన్‌ చేయాలని కోరుతున్న కేటీఆర్‌.. అసలు బ్యారేజీ నిర్మాణం ఎందుకు చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి ఉంటే తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై విమర్శలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపైనా మంత్రి వివేక్‌ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు 20 ఎకరాల భూమి ఉన్నవారు పదేళ్లలో 300 ఎకరాలకు ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా సంపాదించిందో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.

కొండపోచమ్మ సాగర్‌ నుంచి ప్రత్యేక కాలువల ద్వారా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటిని తరలించేందుకు రూ.50 కోట్ల ప్రజాధనాన్ని వినియోగించారని ఆరోపించారు. 2016కు ముందు ఫామ్‌హౌస్‌ ఎదురుగా చెరువు లేదని, అనంతరం 58 ఎకరాల్లో పాండురంగ చెరువును తవ్వించి మోటార్ల ద్వారా పంట పొలాలకు నీటిని తరలించుకున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆరోపించారు.

బాల్క సుమన్‌ ఆస్తులపై ప్రశ్నలు

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఉద్దేశించి కూడా మంత్రి వివేక్‌ వెంకటస్వామి విమర్శలు చేశారు. బాల్క సుమన్‌పై వంద కేసులు ఉన్నాయని ఆరోపిస్తూ, ఆయనకు వంద కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బాల్క సుమన్‌ ఎన్నికల అఫిడవిట్‌ను ప్రజలు పరిశీలించాలని సూచించారు...

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.