Hyderabad: అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..మంత్రి!

Hyderabad: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 4 Nov 2026 4:30 PM IST
Hyderabad
X

Hyderabad: అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..మంత్రి!

Hyderabad: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర, ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు, సామాజిక న్యాయం కోసం సాగించిన ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

అంబేడ్కర్ ఆశయాలు, సమానత్వ భావన, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అంబేడ్కర్ జీవితాన్ని కేవలం రిజర్వేషన్లకే పరిమితం చేయకుండా.. సమాజంలో సమాన హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్ఛామి’ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంబేడ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ నాటక ప్రదర్శనకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ మల్లు రవి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులు హాజరయ్యారు.

అంబేడ్కర్ బాల్యం నుంచి విద్యాభ్యాసం వరకు.. ఎదుర్కొన్న సామాజిక వివక్ష, అణగారిన వర్గాల హక్కుల కోసం సాగించిన పోరాటం, రాజ్యాంగ రచన, దేశానికి అందించిన సేవలను నాటక రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను భావోద్వేగభరితంగా ప్రదర్శించడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తీవ్రమైన అవమానాలు, వివక్ష ఎదురైనా అంబేడ్కర్ ఎక్కడా వెనుకడుగు వేయకుండా తన లక్ష్యం కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు.

మహాత్మా గాంధీ వంటి ప్రముఖులతోనూ తన సిద్ధాంతాలపై చర్చిస్తూ, అణగారిన ప్రజల హక్కుల విషయంలో రాజీపడకుండా నిలబడిన గొప్ప నాయకుడని అభివర్ణించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం, ఎదురైన సవాళ్లను అధిగమించే పట్టుదల, లక్ష్య సాధనలో చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.

ప్రస్తుత తరంలో ఒత్తిళ్లు, సమస్యలు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. సమాజ అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన త్యాగాలను, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

‘సంఘం శరణం గచ్ఛామి’ నాటకాన్ని అద్భుతంగా రూపొందించిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. గత ప్రదర్శనలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగ్గా నాటకాన్ని తీర్చిదిద్దారని, నటీనటులు తమ పాత్రల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. అంబేడ్కర్ జీవిత చరిత్రను పుస్తకాలకే పరిమితం చేయకుండా నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ నాటకాన్ని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు తన వంతు సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా చెన్నూరు, బెల్లంపల్లిలో పెద్ద ఎత్తున నాటక ప్రదర్శనలు నిర్వహించేందుకు సహకరిస్తానని తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలైన సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.