Kagaznagar: సిర్సిల్క్ భూముల వివాదం.. బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్సీ దండే విఠల్ కౌంటర్!

Kagaznagar: సిర్సిల్క్ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఎమ్మెల్సీ దండే విఠల్ ఖండించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 10 Nov 2026 12:33 PM IST
Kagaznagar
X

Kagaznagar: సిర్సిల్క్ భూముల వివాదం.. బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్సీ దండే విఠల్ కౌంటర్!

Kagaznagar: సిర్సిల్క్ భూముల వివాదంపై బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఖండించారు. కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారిక రికార్డులను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత భూ వివాదానికి నాటి బీఆర్‌ఎస్ పాలకుల నిర్ణయాలే కారణమని ఆరోపించారు.

ఈ సందర్భంగా దండే విఠల్ మాట్లాడుతూ సిర్సిల్క్ పరిశ్రమ 1982లో కాకుండా 1984 అక్టోబర్‌లో లాకౌట్ అయి, 1985 ఏప్రిల్‌లో శాశ్వతంగా మూతపడిందని తెలిపారు. అనంతరం పరిశ్రమ ఆస్తులు హైకోర్టు లిక్విడేటర్ పరిధిలోకి వెళ్లాయని వివరించారు. కార్మికుల బకాయిల పేరుతో 2006 ప్రాంతంలో సుమారు 400 ఎకరాల భూమిని ఎనిమిది భాగాలుగా వేలం వేశారని, ఈ వ్యవహారంలో నాటి పాలకుల బంధువులు, సన్నిహితులకు ప్రయోజనం చేకూరిందని ఆరోపించారు.

కార్మికులకు న్యాయం జరిగే వరకు భూముల విక్రయాలు చెల్లవంటూ స్వర్గీయ కావేటి సమ్మయ్య 2009 నుంచి 2014 వరకు న్యాయపోరాటం చేశారని గుర్తుచేశారు. అయితే 2014 తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక గజానికి రూ.1,200 చొప్పున చెల్లించేలా చేసి భూములను క్రమబద్ధీకరించారని విమర్శించారు. 2017 జూలై 9న పలువురికి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు చేయించింది కూడా అప్పటి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

అంతేకాకుండా 2022 జనవరి 10న సిర్సిల్క్ భూముల్లోని ఇళ్లకు మున్సిపల్ నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదని తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అదే ఏడాది జూన్ 15న సర్వే నిర్వహించి, 4,777 మంది ఆక్రమణదారులు ఉన్నట్లు 2023 జనవరి 27న హైకోర్టుకు నివేదిక సమర్పించింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.

నాటి ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదిక ఆధారంగానే భూములు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులు 2025లో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారని ఎమ్మెల్సీ వివరించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన పరిస్థితుల్లోనే అధికారులు నోటీసులు జారీ చేశారని, ఇందులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు సూచించారు. సిర్సిల్క్ పరిశ్రమకు సంబంధించిన విలువైన స్క్రాప్ విక్రయాలు, ఓపెన్ ల్యాండ్ల ఆక్రమణలపై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో భూములు పంచుతామని చెప్పడం కాదని, స్థానికంగా పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

పేదలకు పూర్తి భరోసా

పోచమ్మగూడ, చింతగూడ, కోయవాగు, దాడానగర్‌తో పాటు సిర్సిల్క్ పరిధిలోని ఐదు మున్సిపల్ వార్డుల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేద ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దండే విఠల్ భరోసా ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని, ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తానని తెలిపారు. న్యాయపరంగా, ప్రభుత్వపరంగా బాధితులకు పూర్తి రక్షణ కల్పించేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR