Bellampalli: నకిలీ డెత్ సర్టిఫికెట్ల కేసులో మీ-సేవ ఆపరేటర్ గణేష్ అరెస్ట్!
Bellampalli: బెల్లంపల్లిలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీ కేసులో మీ-సేవ ఆపరేటర్ గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా దరఖాస్తులు సమర్పించినట్లు విచారణలో తేలింది.
Bellampalli: నకిలీ డెత్ సర్టిఫికెట్ల కేసులో మీ-సేవ ఆపరేటర్ గణేష్ అరెస్ట్!
Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో వెలుగుచూసిన అనధికారిక మరణ ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారంలో పోలీసులు మరో కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో కాల్‌టెక్స్ ప్రాంతంలో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేటర్ గణేష్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, తాజాగా మరో వ్యక్తి పట్టుబడటంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 21న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, వారిని డిసెంబర్ 4వ తేదీ వరకు రిమాండ్‌కు పంపించారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో A2 నిందితుడు చిలుముల రవి వెల్లడించిన వివరాల ఆధారంగా మీ-సేవ కేంద్రం ద్వారా జరిగిన దరఖాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బెల్లంపల్లి పట్టణంలోని కాల్‌టెక్స్ ప్రాంతంలో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్న గణేష్‌కు కమిషన్ చెల్లించి, అతని కేంద్రం ద్వారా ఆరుగురు వ్యక్తులకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. ఇందులో నలిమేళ రామయ్యకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం పొందేందుకు ఎలాంటి ఆధార పత్రాలు సమర్పించకుండా, కేవలం చిరునామా ఆధారంగా తెల్లకాగితాన్ని జతచేసి దరఖాస్తు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సరైన ఆధారాలు లేకుండా మరణ ధృవీకరణ పత్రాల జారీకి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ-సేవ ఆపరేటర్ గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో A3 నిందితుడు మసాది వైకుంఠం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే అతడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
భూ రికార్డుల మార్పులు, ఆస్తుల బదలాయింపులకు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ప్రాధాన్యత సంతరించుకుంది.




