Mancherial: ప్రతిభా నర్సింగ్‌హోమ్‌లో గర్భిణీ మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన!

Mancherial: వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి చెందిందంటూ మంచిర్యాల ప్రతిభా నర్సింగ్‌హోమ్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన. సమగ్ర విచారణకు డిమాండ్.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 5 Oct 2026 11:23 AM IST
Mancherial
X

Mancherial: ప్రతిభా నర్సింగ్‌హోమ్‌లో గర్భిణీ మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన!

Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రతిభా నర్సింగ్ హోమ్‌లో గర్భిణీ మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతి చెందిందని వారు ఆరోపించారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సాధారణ వైద్య పరీక్షల కోసం గర్భిణీని నిన్న ఉదయం ప్రతిభా నర్సింగ్ హోమ్‌కు తీసుకువచ్చారు. స్కానింగ్ నిర్వహించిన వైద్యులు గర్భంలోని శిశువు హార్ట్‌బీట్ లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు మరో స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ కూడా శిశువు హార్ట్‌బీట్ లేదని నిర్ధారణ అయినట్లు తెలిపారు.

అనంతరం శిశువును తొలగించేందుకు చికిత్సకు అంగీకరించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే రూ.20 వేల చెల్లించిన తర్వాతే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారని ఆరోపించారు. సాయంత్రం సుమారు 3.30 నుంచి 4 గంటల మధ్య డబ్బులు చెల్లించిన తర్వాతే చికిత్స ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.

ఆ తర్వాత శస్త్రచికిత్స చేయకుండా సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారని, రాత్రి నొప్పులు రావడానికి ఇంజెక్షన్లు ఇచ్చి వాకింగ్, ఇతర ప్రక్రియలు చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిందని తెలిపారు.

కొద్దిసేపటి తర్వాత గర్భిణీని వెంటిలేటర్‌పై అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తరలించారని కుటుంబ సభ్యులు చెప్పారు. మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే హార్ట్‌బీట్, పల్స్ లేవని, గర్భిణీ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు.

ప్రతిభా నర్సింగ్ హోమ్‌లోనే సకాలంలో తగిన చికిత్స అందించి ఉంటే గర్భిణీ ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రెండు ప్రాణాలు కోల్పోయామని ఆరోపించారు.

ఇలాంటి ఘటనలు మరెవరికీ జరగకుండా సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.

కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై ప్రతిభా నర్సింగ్ హోమ్ యాజమాన్యం, అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.