Mancherial: మంచిర్యాల అభివృద్ధికి రూ.225 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు!
Mancherial: మంచిర్యాల అభివృద్ధికి రూ. 225 కోట్లతో రోడ్ల విస్తరణ, రాళ్లవాగుపై రూ. 23 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు.
Mancherial: మంచిర్యాల అభివృద్ధికి రూ.225 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు!
Mancherial: పట్టణంలో నూతన రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణ ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల పట్టణం–రాళ్లపేట మధ్య రాళ్లవాగుపై రూ.23 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి పనులను మేయర్ దర్ణి మధుకర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో సుమారు రూ.225 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. క్వారీ రోడ్డు నుంచి మంచిర్యాల రహదారి వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు.
అలాగే పాత మంచిర్యాల గోదావరి పరివాహక ప్రాంతం నుంచి సాయికుంట వరకు, పట్టణంలోని అమరవీరుల స్తూపం నుంచి శ్రీరాంపూర్ కొత్త రోడ్డు వరకు రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు.
మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఏడాదిలోపు రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రజా సౌకర్యాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, మంచిర్యాల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగర మేయర్ దర్ణి మధుకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




