Mancherial: వర్షాభావంతో మంచిర్యాల జిల్లాలో ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు!
Mancherial: మంచిర్యాల జిల్లాలో వానలు లేక ఎండుతున్న పంటలు. చివరి తడి కోసం ట్యాంకర్లతో నీళ్లు పారిస్తూ రైతుల తండ్లాట. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు.
Mancherial: వర్షాభావంతో మంచిర్యాల జిల్లాలో ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు!
Mancherial: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం, పంటలకు చివరి తడి అందకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం బొప్పారం గ్రామానికి చెందిన రైతు పల్లె నర్సయ్య తన పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి పొలానికి పారిస్తున్న పరిస్థితి రైతుల కష్టాలకు అద్దం పడుతోంది..
ఈ ఏడాది కాలం కొంత ఆలస్యమైనప్పటికీ, ఓ మోస్తరు వర్షాలు కురవడంతో ఆశతో రైతులు వరి, పత్తి పంటలను సాగు చేశారు. అయితే సాగు ప్రారంభంలో ఎరువుల కొరత రైతులను ఇబ్బందులకు గురిచేయగా, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎరువుల కోసం అష్టకష్టాలు పడి, పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేసిన రైతులకు ఇప్పుడు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. నెల రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. సమీపంలో నీటి వసతులు ఉన్నవారు మోటార్లు, జనరేటర్ల సహాయంతో పొలాలకు నీటిని అందిస్తున్నారు. నీటి వసతులు లేని రైతులు మాత్రం ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటలకు చివరి తడి అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులకు అదనంగా నీటి సరఫరా ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. మోటార్లు, జనరేటర్లకు గిరాకీ పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు మోటార్లపై ఆధారపడుతుండటంతో వ్యవసాయ విద్యుత్ అవసరం పెరుగుతోంది. అయితే విద్యుత్ సరఫరా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నీటిని అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు అదనపు నీటి ఖర్చులు.. ఇంకోవైపు వర్షాల కోసం ఎదురుచూపులు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోతే అప్పులు ఎలా తీర్చాలి? పెట్టిన పెట్టుబడులు ఎలా తిరిగి వస్తాయి? అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడితే తమ కుటుంబాల జీవనాధారం దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటలను కాపాడుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని, వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు.. మరోవైపు చేతికొచ్చే పంటను కాపాడుకునేందుకు నీటి కోసం పడుతున్న తిప్పలు అన్నదాతల దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.




