Hyderabad: బొగ్గు సరఫరా రోజుకు 14 వేల టన్నులకు పెంచాలి: సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి!
Hyderabad: యాదాద్రి విద్యుత్ కేంద్రానికి నైనీ బొగ్గు సరఫరా రోజుకు 14 వేల టన్నులకు పెంచాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశం. సింగరేణి భవన్‌లో కీలక సమీక్ష.
Hyderabad: బొగ్గు సరఫరా రోజుకు 14 వేల టన్నులకు పెంచాలి: సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి!
హైదరాబాద్, సెప్టెంబర్ 17: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ బొగ్గు సరఫరాను మరింత పెంచేందుకు సింగరేణి చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం నైనీ నుంచి రోజుకు సగటున 2,100 టన్నుల బొగ్గు రవాణా జరుగుతుండగా.. దీనిని దశలవారీగా రోజుకు 10 వేల నుంచి 14 వేల టన్నులకు పెంచాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు.
గురువారం సింగరేణి భవన్‌లో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్‌మెంట్, నైనీ ఏరియా జీఎంతో సీఎండీ బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. నైనీ గని వద్ద అవసరమైన మేర బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని జీఎం బైద్య సీఎండీకి వివరించారు.
ప్రస్తుతం రాత్రి వేళల్లో లారీల ద్వారా బొగ్గును రైల్వే సైడింగ్‌లకు తరలిస్తున్న నేపథ్యంలో.. లారీల సంఖ్యను పెంచి రవాణాను వేగవంతం చేయాలని సీఎండీ సూచించారు. అవసరమైతే కొత్త రవాణా కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
అలాగే ఒడిశాలోని అంగూల్ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని రోడ్డు మార్గంలో బొగ్గు తరలింపునకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైల్వే సైడింగ్‌ల వద్ద రేకులు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, విద్యుత్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణాను పెంచాలని సీఎండీ స్పష్టం చేశారు.
సమీక్షలో సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఈడీ కోల్ మూవ్‌మెంట్ బి. వెంకన్న, జీఎం టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




