Singareni: సింగరేణికి జాతీయస్థాయిలో 5 స్టార్ రేటింగ్ అవార్డులు!

Singareni: సింగరేణికి చెందిన ఐదు బొగ్గు గనులు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను దక్కించుకున్నాయి. కేంద్ర మంత్రి చేతుల మీదుగా సీఎండీ అవార్డు అందుకున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Nov 2026 9:22 PM IST
Singareni
X

Singareni: సింగరేణికి జాతీయస్థాయిలో 5 స్టార్ రేటింగ్ అవార్డులు!

సింగరేణి: దేశ బొగ్గు పరిశ్రమలో సింగరేణి కాలరీస్ మరోసారి తన సత్తా చాటింది. అత్యుత్తమ మైనింగ్ ప్రమాణాలు, కార్మికుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనబరిచిన సింగరేణికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థకు చెందిన ఐదు బొగ్గు గనులు ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను సాధించాయి. దీంతో సింగరేణి ఖ్యాతి జాతీయస్థాయిలో మరోసారి మార్మోగింది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు.

ఐదు గనులకు ఫైవ్ స్టార్ గుర్తింపు

సింగరేణిలోని శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్‌కే న్యూటెక్ (ఆర్‌కేఎన్‌టీ), ఆర్‌కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీగూడ ఓసీ, రామగుండం-3 ఏరియాలోని ఆర్‌జీఓసీ-1 గనులు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. ముఖ్యంగా శ్రీరాంపూర్, బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లోని గనులకు ఈ గుర్తింపు రావడం సింగరేణి ప్రాంతాలకు గర్వకారణంగా నిలిచింది.

84 అంశాల ఆధారంగా మూల్యాంకనం

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం దేశంలోని ఉత్తమ బొగ్గు గనులకు స్టార్ రేటింగ్ అందిస్తుంది. గని పనితీరు, కార్మికుల భద్రత, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, కార్మిక సంక్షేమం తదితర 84 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మూల్యాంకనం నిర్వహిస్తారు. కేంద్ర బొగ్గు శాఖకు చెందిన పరిశీలక బృందాలు క్షేత్రస్థాయిలో గనులను పరిశీలించి మార్కులు కేటాయిస్తాయి. మొత్తం 100 మార్కులకు గాను 91 కంటే ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అందిస్తారు. ఇంతటి కఠినమైన ప్రమాణాల్లో సింగరేణికి చెందిన ఐదు గనులు అత్యున్నత రేటింగ్ సాధించడం సంస్థ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

కార్మికుల కృషికి దక్కిన గుర్తింపు

ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావడంపై సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం గనుల యాజమాన్యాలు, అధికారులు, కార్మికుల సమష్టి కృషికి దక్కిన ఫలితమని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని గనులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా ఉత్తమ ప్రమాణాలతో పనిచేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

భట్టి విక్రమార్క అభినందనలు

సింగరేణిలో ఐదు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచాలని ఆకాంక్షించారు.

ఈ అవార్డుల కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝా, కోల్ కంప్ట్రోలర్ సతీష్ కుమార్, కోల్ ఇండియా సీఎండీ సాయిరాం, సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు, పలువురు జనరల్ మేనేజర్లు, ఏరియా అధికారులు, గనుల మేనేజర్లు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.