Mancherial: కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఇవ్వాలి!
Mancherial: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని మంచిర్యాల పద్మశాలి సంఘం కోరింది.
Mancherial: కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఇవ్వాలి!
Mancherial: తెలంగాణ ఉద్యమంలో మూడు తరాల పాటు కీలక పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారిణి డాక్టర్ పవిత్ర వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని మంచిర్యాల జిల్లా పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి పద్మశాలి సామాజిక వర్గానికి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ సంఘం సమావేశంలో తీర్మానం చేశారు.
ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో పద్మశాలీలకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సంఘం నాయకులు తెలిపారు. ఆ హామీని అమలు చేస్తూ డాక్టర్ పవిత్ర వాణికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న యోధుడిగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను నాయకులు గుర్తు చేశారు. తెలంగాణ సాధనే జీవిత ధ్యేయంగా చివరి శ్వాస వరకు పోరాడిన ఆయన కుటుంబానికి రాజకీయంగా గుర్తింపు ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు.
డాక్టర్ పవిత్ర వాణికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలకు గౌరవం కల్పించినట్లవుతుందని, ఆయన ఆశయాలకు గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీకి తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ఆయన నివాసమైన జలదృశ్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించినప్పటికీ, ఆయన మరణానంతరం కనీస నివాళులు అర్పించలేదని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేక వైఖరి కలిగిన నాయకులకు నివాళులర్పించిన బీఆర్ఎస్, తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన బాపూజీని విస్మరించిందని మండిపడ్డారు.
మంచిర్యాలలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని డాక్టర్ పవిత్ర వాణికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ తీర్మానం చేశారు.
ఈ సమావేశంలో గజెల్లి వెంకటయ్య, అడిచెర్ల రాజేశం, శ్రీనివాస్, రవి, రుక్మారావు, నారాయణ, చిప్ప రామస్వామి, డి.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.




