Narsapur: ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో NH-765D జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వడ్డె ఎల్లయ్య (64) మృతి చెందారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 23 Nov 2026 1:16 PM IST
Narsapur
X

Narsapur: ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి!

Narsapur: నర్సాపూర్ పట్టణంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 64 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన వడ్డె ఎల్లయ్య (64) ఈ నెల 22వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో సిగరెట్ కొనుగోలు చేసేందుకు తన TVS XL వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

ఈ క్రమంలో 23వ తేదీ తెల్లవారుజామున సుమారు 2:45 గంటల సమయంలో నర్సాపూర్ పట్టణంలోని బాలాజీ ఫుట్‌వేర్ షాపు ఎదురుగా, మెదక్ వైపు వెళ్లే NH-765D జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఎల్లయ్య ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న నర్సాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఎల్లయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

మృతుడి కుమారుడు వడ్డె అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సాపూర్ ఎస్‌ఐ ఏ. రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం, దాని డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.

సీసీ కెమెరాలపై పోలీసుల దృష్టి..

ప్రమాద సమయంలో ఆ మార్గంలో ప్రయాణించిన వాహనదారులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరికైనా సమాచారం తెలిస్తే నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించాలని, ప్రమాదానికి కారణమైన వాహనంతో సహా పరారవడం చట్టరీత్యా నేరమని పోలీసులు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ sho రంజిత్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR