Hathnoora: సంగారెడ్డి జిల్లాలో అక్రమ క్లినిక్‌లపై అధికారుల ఉక్కుపాదం.. 7 క్లినిక్‌లు, ల్యాబ్ సీజ్!

Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర, దౌల్తాబాద్ మండలాల్లో అనధికారికంగా వైద్య సేవలు అందిస్తున్న 7 క్లినిక్‌లు, ల్యాబ్ సీజ్. అధికారుల ఆకస్మిక తనిఖీలు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 4 Sept 2026 11:22 AM IST
Hathnoora
X

Hathnoora: సంగారెడ్డి జిల్లాలో అక్రమ క్లినిక్‌లపై అధికారుల ఉక్కుపాదం.. 7 క్లినిక్‌లు, ల్యాబ్ సీజ్!

హత్నూర: నిబంధనలు పక్కనపెట్టి అనుమతికి మించి వైద్య సేవలు అందిస్తున్న క్లినిక్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సంగారెడ్డి జిల్లా హత్నూర, దౌల్తాబాద్ మండలాల్లో గురువారం డీఐఓ డాక్టర్ శశాంక్ దేశ్‌పాండే ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన 7 క్లినిక్లతో పాటు ఓ హెల్త్‌కేర్ ల్యాబ్‌ను సీజ్ చేశారు. హత్నూర మండల కేంద్రంలో మూడు, దౌల్తాబాద్‌లో నాలుగు క్లినిక్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

సెలైన్‌లు.. ఇంజక్షన్లు.. ల్యాబ్ పరీక్షలు!

ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ పరిధిలో ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాల్సి ఉండగా, కొందరు స్థాయికి మించి రోగులకు వైద్యం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సెలైన్‌లు పెట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడం, ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం వంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు డీఐఓ తెలిపారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని డాక్టర్ శశాంక్ దేశ్‌పాండే హెచ్చరించారు. మెడికల్ షాపులపైనా ఎప్పటికప్పుడు ద్రుష్టి పెడుతామని పేర్కొన్నారు. తనిఖీల్లో కొన్ని మెడికల్ షాపుల్లో అనుమతులు లేకుండా కొన్ని రకాల మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై డ్రగ్స్ అధికారులకు నివేదిక అందిస్తామని వెల్లడించారు. దేవి క్లినిక్, ల్యాబ్‌కు రూ.25 వేల చొప్పున జరిమానా విధించినట్లు డీఐఓ తెలిపారు.

ఇక ఉపేక్షించేది లేదు!

ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ స్థాయిని దాటి వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడితే కేసులు నమోదు చేయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లు, నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న కేంద్రాలపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

అనుమతులు ఒకచోట.. వైద్యం మరోచోట అన్నట్లుగా వ్యవహరిస్తే కుదరదు.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చట్ట రీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story