Narsapur: మండలం లింగాపూర్ రైతు వేదికలో ఘనంగా సాగిన మెగా విత్తన మేళా!

Narsapur: లింగాపూర్ రైతువేదికలో వ్యవసాయ శాఖ విత్తన మేళా నిర్వహించి, వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించింది.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 28 July 2026 4:41 PM IST
Narsapur
X

Narsapur: మండలం లింగాపూర్ రైతు వేదికలో ఘనంగా సాగిన మెగా విత్తన మేళా!

నర్సాపూర్: రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న వేళ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ రైతులకు అండగా నిలిచింది వ్యవసాయ శాఖ. నర్సాపూర్ మండలం లింగాపూర్ రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన "రైతు నేస్తం" 100వ ఎపిసోడ్ ప్రత్యక్ష ప్రసారంతో పాటు విత్తన మేళా రైతుల్లో కొత్త ఆశలు నింపింది.

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ విత్తన మేళాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన కూరగాయల విత్తనాలు, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు, పశుగ్రాస విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ రైతులకు అందుబాటులో ఉంచారు. ఒకే వేదికపై నాణ్యమైన విత్తనాలు లభించడంతో రైతులు ఆసక్తిగా కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి దీపిక మాట్లాడుతూ... వర్షాల కోసం ఎదురుచూడకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ నీటితో మంచి దిగుబడులు ఇచ్చే జొన్నలు, కందులు, మినుములు, పెసర్లు, కూరగాయల వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.

టీ ఆర్ వి కె (తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం) శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అనుసరించాల్సిన శాస్త్రీయ సాగు విధానాలను వివరించారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ వినియోగం వల్ల ఎరువుల సామర్థ్యం పెరగడంతో పాటు సాగు వ్యయం తగ్గుతుందని, సరైన విధానంలో వాటిని వినియోగించాలని సూచించారు.

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజకళా శ్రీనివాస్ గుప్తా, ఉపసర్పంచ్ రవి, వ్యవసాయ విస్తరణ అధికారులు మోహన్, తేజస్విని, రాజశేఖర్, లావణ్య, దుర్గాప్రసాద్, విత్తన డీలర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.వర్షాలు ఆలస్యమైనా రైతులు నిరాశ చెందకుండా పరిస్థితులకు తగ్గ పంటలను ఎంచుకుని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తే దిగుబడులు సాధించవచ్చనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అధికారులు రైతులకు అందించారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story