Medak: అందోల్‌లో వీరనారి రాణి శంకరమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి!

Medak: మెదక్ జిల్లా అందోల్‌లో రాణి శంకరమ్మ విగ్రహ ఏర్పాటుకు గ్రామీణులు, యువత భారీ బైక్ ర్యాలీ. మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ చూపాలని ప్రజల విజ్ఞప్తి.

UMASHANKAR, ANDOLE
Published on: 24 Oct 2026 12:11 PM IST
Medak
X

Medak: అందోల్‌లో వీరనారి రాణి శంకరమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి!

Medak: మెదక్ జిల్లా అందోల్‌లో చారిత్రక వీరనారి రాణి శంకరమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ మార్మోగుతోంది. అందోల్ గ్రామ ప్రవేశద్వారం వద్ద విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ స్థానిక యువత, గ్రామస్తులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో త్వరలో జరగబోయే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల నాటికే విగ్రహ ఏర్పాటు పూర్తి కావాలని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఉద్యమాలకు, చారిత్రక సంపదకు నిలయమైన అందోల్ గడ్డపై మరోసారి ప్రాంతీయ ఆత్మగౌరవ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఒకనాటి అందోల్ సంస్థానాన్ని ఏలి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన వీరనారి రాణి శంకరమ్మ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టించాలని స్థానికులు గట్టిగా కోరుతున్నారు. అందోల్ యూత్ ఆధ్వర్యంలో రాణి శంకరమ్మ ఫ్లెక్సీతో యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను చాటిచెప్పారు. గ్రామ ఎంట్రీ కమాన్ (స్వాగత తోరణం) వద్ద అన్ని హంగులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం అందోల్‌లో నూతనంగా చేపట్టిన రోడ్ డివైడర్ల పనులు, 150 పడకల ఆసుపత్రి, అలాగే నర్సింగ్ కాలేజ్ భవన నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాల నాటికే రాణి శంకరమ్మ విగ్రహాన్ని కూడా సిద్ధం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అందోల్ చరిత్ర, రాణి శంకరమ్మ చేసిన ధర్మకార్యాలు భావితరాలకు తెలిసేలా ఈ విగ్రహం నిలుస్తుందని వారు నమ్ముతున్నారు. ఈ విషయంలో నియోజకవర్గ ప్రతినిధి, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక దృష్టి సారించి, తక్షణమే నిధులు మంజూరు చేసి విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపాలని అందోల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE