Medak: రైతుల వెంటే కేంద్ర ప్రభుత్వం: బీజేపీ నాయకుడు మల్లేష్ గౌడ్

Medak: తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పోరాడతామని నర్సాపూర్‌లో హెచ్చరించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 7 Aug 2026 4:44 PM IST
Medak
X

Medak: రైతుల వెంటే కేంద్ర ప్రభుత్వం: బీజేపీ నాయకుడు మల్లేష్ గౌడ్

రైతుల వెంటే బీజేపీ ప్రభుత్వం: మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వళ్దాస్ మల్లేష్ గౌడ్

ఫసల్ బీమా యోజనను తెలంగాణలో వెంటనే అమలు చేయాలి.. రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం: బీజేపీ జిల్లా అధ్యక్షులు

నర్సాపూర్, ఆగస్టు 7: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తెలంగాణలో సక్రమంగా అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తోందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని రైతుల వెంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం ఉంటుందని ఉంటుందని స్పష్టం చేశారు..

కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తోందని, అందులో భాగంగానే రైతులకు పంట నష్టాల సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తోందని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రైతులు ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్నారని మల్లేష్ గౌడ్ అన్నారు. భారీ వర్షాలు, వరదలు, కరువు, ఇతర కారణాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు పెట్టుబడులు కోల్పోయి అప్పుల భారంలో కూరుకుపోతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో రైతులకు పంట బీమా ఎంతో కీలకమని, ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేస్తే పంట నష్టపోయిన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మల్లేష్ గౌడ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న పథకాలను కూడా రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం రైతుల కోసం నిధులు, పథకాలు అందిస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రంలో రైతులకు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను బీజేపీ సీరియస్‌గా తీసుకుంటుందని మల్లేష్ గౌడ్ స్పష్టం చేశారు. రైతులకు పంట నష్టం జరిగినా, పంటలకు గిట్టుబాటు ధర విషయంలో ఇబ్బందులు ఎదురైనా, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం అందకపోయినా బీజేపీ రైతుల తరఫున ప్రశ్నిస్తుందని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.

ఫసల్ బీమా యోజనను తెలంగాణలో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మల్లేష్ గౌడ్ డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలను రాజకీయ కోణంలో చూడకుండా.. అర్హులైన ప్రతి రైతుకు వాటి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను ప్రభుత్వం విడనాడాలని అన్నారు.

రైతులకు ఏ సమస్య వచ్చినా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైతులకు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకపోతే భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని మల్లేష్ గౌడ్ హెచ్చరించారు. రైతుల హక్కుల కోసం అవసరమైతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలపై ఉద్యమిస్తాం: సత్యనారాయణ

కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించి వారికి తగిన సహాయం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సత్యనారాయణ హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ, కిసాన్ మోర్చా రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.

ఈ మీడియా సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణతో పాటు బీజేపీ జిల్లా జనరల్ సెక్రెటరీ సంఘసాని సురేష్,

ఓబీసీ రాష్ట్ర ఉప అధ్యక్షులు రమేష్ గౌడ్,

ఎస్టి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాముల నాయక్,

జిల్లా నాయకులు నారాయణ రెడ్డి, అంజగౌడ్ మరియు బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story