Medak: బీఎస్పీ నేత శాంత కుమార్ మృతి.. నేతల నివాళులు
Medak: మెదక్ నర్సాపూర్‌లో బీఎస్పీ సీనియర్ నేత శాంత కుమార్ మృతి. కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించి సంతాపం తెలిపారు.
Medak
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు శాంత కుమార్ మరణం పట్ల పలు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ప్రాంతీయ రాజకీయాల్లో తీరని లోటుగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.
శాంత కుమార్ పార్థివ దేహాన్ని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, శాంత కుమార్ తెలంగాణ బహుజన ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడిన నిస్వార్థ నాయకుడని కొనియాడారు. ఆయన మృతి బాధాకరమని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శాంత కుమార్ కుటుంబానికి తమ పూర్తి సహకారం ఉంటుందని, ఎల్లప్పుడూ వారి వెంట నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవీందర్, నాగులపల్లి సర్పంచ్ సుమతి శివకుమార్, లింగం, మోహనదాస్, సాయి శరణ్ గౌడ్, రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




