Narsapur: నర్సాపూర్ బీవీఆర్‌ఐటీలో ‘అస్త్ర 2.0’ ఆవిష్కరణల జాతర
Narsapur: నర్సాపూర్ బీవీఆర్‌ఐటీ (BVRIT) కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలు ‘అస్త్ర 2.0’ ఘనంగా ప్రారంభమయ్యాయి.
Narsapur: నర్సాపూర్ బీవీఆర్‌ఐటీలో ‘అస్త్ర 2.0’ ఆవిష్కరణల జాతర
నర్సాపూర్: బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ), నర్సాపూర్‌లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అస్త్ర 2.0 (ASTHRA 2.0) 2026’ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ సృజనాత్మకత, ఆవిష్కరణల పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థి బృందాలు పాల్గొంటున్నాయి.
ప్రధాన అతిథిగా పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ, తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రాయోగిక ఆవిష్కరణలుగా మలచాల్సిన అవసరాన్ని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకుని పరిశోధనల దిశగా ముందుకు సాగాలని సూచించారు. యువ ఆవిష్కర్తలకు ఐఐటీ హైదరాబాద్ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు.
విశిష్ట అతిథిగా హాజరైన ఐఐసీఈచ్ఈ (IIChE) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జేఎన్‌టీయూ అనంతపురం రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఎ.వి.ఎన్. స్వామి మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, పరిశోధన దృక్పథం, ఆవిష్కరణ సామర్థ్యం మరియు టీమ్‌వర్క్‌ను పెంపొందించే వేదికగా అస్త్ర పోటీలు నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే మాట్లాడుతూ, విద్యార్థుల సాంకేతిక ప్రతిభను వెలికితీసే జాతీయ స్థాయి పోటీలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు.
కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డా. జి.బి. రాధిక మాట్లాడుతూ, ‘కెమ్-ఇ-కార్’ భావన, దాని ప్రాముఖ్యతను వివరించారు. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ప్రతి ఏడాది మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటోందని తెలిపారు.
ఈ పోటీలలో ప్రధాన ఆకర్షణలుగా ‘రియాక్ట్-ఓ-కార్’, ‘టెక్-ఓ-కార్’, ‘క్యూబ్-ఎక్స్’ పోటీలు నిలిచాయి. రసాయన, ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్యల ఆధారంగా పనిచేసే మోడల్ కార్లతో రియాక్ట్-ఓ-కార్ పోటీ నిర్వహించగా, మెకానికల్, ఎలక్ట్రానిక్ సాంకేతికతల సమన్వయంతో టెక్-ఓ-కార్ పోటీ జరిగింది. క్యూబ్-ఎక్స్‌లో నీటి శుద్ధి, కార్బన్ డయాక్సైడ్ క్యాప్చర్ వంటి వాస్తవ సమస్యలకు విద్యార్థులు వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు.
మొదటి రోజు రియాక్ట్-ఓ-కార్‌కు సంబంధించిన భద్రతా తనిఖీలు విజయవంతంగా నిర్వహించగా, టెక్-ఓ-కార్, క్యూబ్-ఎక్స్ పోటీలు విజయవంతంగా పూర్తయ్యాయి.
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన SVNIT సూరత్, VNIT నాగ్‌పూర్, IISER భోపాల్, NIT తిరుచిరాపల్లి, ఎస్‌వీయూ తిరుపతి, ఆర్జీయూకేటీ నూజివీడు, జేఎన్‌టీయూ హైదరాబాద్‌తో పాటు బీవీఆర్‌ఐటీ హైదరాబాద్, బీవీఆర్‌ఐటీ నర్సాపూర్ కళాశాలలకు చెందిన మొత్తం 24 బృందాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
విద్యార్థుల్లో ఆవిష్కరణలు, పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు అస్త్ర 2.0 వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్‌లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అపిటోరియా ఫార్మా, నకోడా కెమికల్స్ లిమిటెడ్, గ్రాన్యూల్స్ ఇండియా, ప్రోటెక్ ఇంజనీరింగ్, వసంత్ కెమికల్స్, విర్చోవ్స్, సోల్వోసాల్ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సహకారాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు.




