Narsapur: బీవీఆర్‌ఐటీలో విష్ణు జాతీయ సర్వేయింగ్ పోటీలు ప్రారంభం!

Narsapur: నర్సాపూర్ బీవీఆర్‌ఐటీలో విష్ణు జాతీయ స్థాయి సర్వేయింగ్ పోటీలు (VNSC 2026) ప్రారంభం 3 రాష్ట్రాల నుంచి 56 జట్లు హాజరు బుధవారం సివిల్ విద్యార్థులకు ప్రత్యేక జాబ్ మేళా.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 29 Sept 2026 9:35 PM IST
Narsapur
X

Narsapur: బీవీఆర్‌ఐటీలో విష్ణు జాతీయ సర్వేయింగ్ పోటీలు ప్రారంభం!

నర్సాపూర్, సెప్టెంబర్ 29, 2026: నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో విష్ణు జాతీయ స్థాయి సర్వేయింగ్ పోటీలు–2026 (VNSC 2026) ఘనంగా ప్రారంభమయ్యాయి. బీవీఆర్‌ఐటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి.

ఈ జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 27 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 56 విద్యార్థి బృందాలు పాల్గొంటున్నాయి. తెలంగాణ నుంచి ఐఐటీ హైదరాబాద్, సీబీఐటీ, వీఎన్‌ఆర్ తదితర ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన 15 కళాశాలలు, కర్ణాటక నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 8 ఇంజినీరింగ్ కళాశాలలు పోటీల్లో పాల్గొంటున్నాయి.

సర్వేయింగ్‌లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు ప్రాధాన్యం

విద్యార్థుల్లో సర్వేయింగ్, ఫీల్డ్ మెజర్‌మెంట్స్, ఆధునిక సర్వేయింగ్ పద్ధతులపై సాంకేతిక, ప్రాక్టికల్ నైపుణ్యాలను పరీక్షించేలా పోటీలను రూపొందించారు. తరగతి గదిలో నేర్చుకున్న సూత్రాలను వాస్తవిక ఫీల్డ్ పరిస్థితుల్లో ఎలా అన్వయించుకోవాలో విద్యార్థులకు ఈ పోటీలు అనుభవాన్ని అందిస్తున్నాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాకబ్స్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ గ్లోబల్ సొల్యూషన్స్ డైరెక్టర్–హైవేస్ శ్రీ వెంకటేశ్వరరావు బలుసు మాట్లాడుతూ.. సర్వేయింగ్‌లో ఖచ్చితత్వం, నమ్మకం, బాధ్యత అత్యంత కీలకమని అన్నారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాథమిక సర్వేయింగ్ సూత్రాలపై బలమైన పట్టు సాధించాలని సూచించారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిరతకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో సివిల్ ఇంజినీరింగ్‌లో డిజైన్, స్ట్రక్చరల్, పర్యావరణం, సస్టైనబిలిటీ తదితర విభాగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

NHAIలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు

గౌరవ అతిథిగా పాల్గొన్న NHAI గజ్వేల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి వై. మాధవి మాట్లాడుతూ.. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను వివరించారు.

పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్న ఆమె.. సర్వేయింగ్ పరికరాలు, ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకుని, ఫీల్డ్‌లో ప్రత్యక్ష అనుభవం పొందాలని విద్యార్థులకు సూచించారు.

కోర్ ఇంజినీరింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం

శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీ రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ.. చైర్మన్ శ్రీ కె.వి. విష్ణు రాజు మార్గదర్శకత్వంలో కోర్ ఇంజినీరింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

సర్వేయింగ్, మ్యాపింగ్‌లు సివిల్ ఇంజినీరింగ్‌లో కీలకమైన అంశాలని, విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, హ్యాండ్స్‌ఆన్ అనుభవం కల్పించేందుకు బీవీఆర్‌ఐటీ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.

విద్యార్థుల ఉద్యోగ నైపుణ్యాలను మరింత మెరుగుపరిచే దిశగా బుధవారం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం జాబ్ మేళా (HR Meet) నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వధా బిల్డర్స్, ప్రోథియన్స్, కేపీసీ ప్రాజెక్ట్స్, కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్, జీకేసీ ప్రాజెక్ట్స్, ఎఫెక్ట్ టెక్, సత్వ, ప్రెక్స్‌సర్వ్ కన్‌స్ట్రక్షన్ కన్సల్టెంట్స్, ఆఫ్‌కాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ తదితర సంస్థలు విద్యార్థుల నియామక ప్రక్రియలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి పోటీలు

కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్ సివిల్ ఇంజినీరింగ్‌లో ఉన్న అవకాశాలను వివరించారు. ASCE Chapter ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి పోటీలు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.1 లక్ష ప్రైజ్ మనీతో పాటు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ డుబే విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. VNSC 2026 ఆర్గనైజింగ్ చైర్‌గా సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్, హెడ్ డా. ఎస్. కృష్ణారావు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల మేనేజర్ శ్రీ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ సురేష్ పోటీలకు అవసరమైన వసతులు, ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR