Sangareddy: బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు!

Sangareddy: కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Nov 2026 10:49 AM IST
Sangareddy
X

Sangareddy: బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు!

Sangareddy: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి. పురాతన పుణ్యక్షేత్రమైన బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మరోవైపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో మహాచండీ యాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. పరమశివుడికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లలో వేచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపారాధన స్థలంలో 360 వత్తుల దీపాలు, ఉసిరి దీపాలు, కార్తీక దీపాలను వెలిగించి భక్తులు తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. వేలాది దీపాల కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయింది. హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

భక్తుల దర్శనార్థం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశామని, మంచినీటి సదుపాయం కల్పించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు.

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మహాచండీ యాగం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. భక్తి, దీపకాంతులు, శివనామస్మరణలతో బీరంగూడ ఆలయం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్