Hathnoora: రైతుల ఆందోళన.. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ ధర్నా!

Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతుల ధర్నా. పంటలను కాపాడాలని డిమాండ్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 5 Oct 2026 3:30 PM IST
Hathnoora
X

Hathnoora: రైతుల ఆందోళన.. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ ధర్నా!

Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

హత్నూర మండలంలోని నస్తీపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని పలువురు రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వం వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రైతులు ఆరోపించారు.

తమ ప్రాంతంలో రోజుకు సుమారు 7 గంటలపాటు మాత్రమే విద్యుత్ అందుతోందని, అందులోనూ నిరంతరాయంగా సరఫరా కాకుండా తరచూ కోతలు విధిస్తున్నారని రైతులు తెలిపారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పంటలకు నీరు అందించాల్సిన అత్యంత కీలక సమయం అని రైతులు చెబుతున్నారు. కరెంటు సరఫరా లేకపోవడంతో బోర్లు, వ్యవసాయ మోటార్లు నడపలేకపోతున్నామని.. దీంతో పొలాల్లో పంటలు నీరు అందక ఎండిపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకవైపు సాగు కోసం పెట్టుబడులు పెడుతూ మరోవైపు విద్యుత్ కోసం ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు వాపోయారు. సమయానికి నీరు అందకపోతే చేతికొచ్చిన పంట కూడా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కరెంటు కోతలు ఇలాగే కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కనీసం 10 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటలకు నీరు అందించే సమయంలో కరెంటు కోతలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నస్తీపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యను అధికారులు వెంటనే పరిశీలించి, రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరాను క్రమబద్ధీకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటున్న రైతులు.. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి తమ పంటలను కాపాడాలని వేడుకొంటున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR