Medak: రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి: మెదక్ డీఏఓ!

Medak: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మెదక్ డీఏఓ కె. దేవ్ కుమార్ సూచించారు.

NAGARAJ, MEDAK
Published on: 16 Nov 2026 5:21 PM IST
Medak
X

Medak: రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి: మెదక్ డీఏఓ!

మెదక్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు ప్రణాళికలో మార్పులు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె. దేవ్ కుమార్ సూచించారు. వర్షాభావ పరిస్థితులు, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, సాగునీటి కొరత కారణంగా వరి సాగుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు. అందువల్ల రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని అయన కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో పండే జొన్న, శనగ, కుసుమ, నువ్వులు, పొద్దుతిరుగుడు, మినుములు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం ద్వారా నీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

రైతుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామ వ్యవసాయ అధికారులతో పాటు గ్రామ సర్పంచులు, రైతులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆరుతడి పంటల సాగు విధానాలు, వాటి ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేయాలనే ఆలోచన నుంచి రైతులు బయటకు రావాలని దేవ్ కుమార్ సూచించారు. అయితే ఎల్‌నినో ప్రభావం ఉందనే కారణంతో అన్ని ప్రాంతాల్లో వరి సాగును పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదని, నీటి లభ్యత, వర్షపాతం, స్థానిక పరిస్థితులను బట్టి పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

పంట ఎంపికలో ముందుచూపు, సాగు విధానాల్లో మార్పులు, నీటి వనరుల సమర్థ వినియోగమే వాతావరణ మార్పులను ఎదుర్కొనే మార్గమని పేర్కొన్నారు. రైతులు ముందుగానే అప్రమత్తమై ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన పెంచుకుంటే నీటి కొరత వల్ల కలిగే పంట నష్టాలను కొంతవరకు నివారించుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK