Medak: రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా హరీశ్‌రావు!
Medak: కౌడిపల్లి నిరసన ప్రదర్శన రైతులకు ఎరువులు, రైతుబంధు బకాయిలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన హరీశ్‌రావు
Medak: రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా హరీశ్‌రావు!
Medak: మెదక్ జిల్లా, కౌడిపల్లి కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
రైతులకు అవసరమైన సమయంలో యూరియా, డీఏపీ, 20:20 వంటి ఎరువులు అందడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. యూరియా కోసం రైతులు ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శివంపేట, రామాయంపేట, దుబ్బాక, మాసాయిపేట తదితర ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో రైతులకు భరోసా ఇచ్చాం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు, సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు అండగా నిలిచామని హరీశ్‌రావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఎరువుల విషయంలో ప్రభుత్వం సగం సగంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రూ.29 వేల కోట్ల రైతుబంధు బకాయిలు చెల్లించాలి
రైతుబంధు విషయంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. రైతులకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయాలని కోరారు.
సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిలిచిపోయాయి?
ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ హయాంలో ప్రారంభించిన పలు సాగునీటి పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని హరీశ్‌రావు అన్నారు. సంగమేశ్వర్–బసవేశ్వర్, గణపురం ఆయకట్టు, కాళేశ్వరం కాలువలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
గణపురం ఆనకట్ట ఎత్తు పెంపు కోసం గత ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, ఆ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. మూడేళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా ఒక్క చెరువు, ఒక్క చెక్‌డ్యామ్, ఒక్క కాలువ నిర్మించారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
“ఉమ్మడి మెదక్ జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకంత కోపం?”
ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి, రైతు సంక్షేమ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మి, పింఛన్లు తదితర సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల తరఫున బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కౌడిపల్లి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన హరీష్ రావు
కౌడిపల్లి మండలంలో రైతుల రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం నిరూపిస్తే తాను, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేస్తామని హరీశ్‌రావు సవాల్ చేశారు. రైతులు, ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.




